Msme Budget 2023: ఎంఎస్ఎంఈలకు పెద్ద ఊరట, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌కు రూ.9వేల కోట్లు
బడ్జెట్ 2023లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు భారీ ఊరట లభించింది. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ. 9,000కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఎంఎస్ఎంఈలకు రుణాల కోసం రూ. 2 లక్షల కోట్లను కేటాయించనున్నట్లు నిర్మల వెల్లడించారు. ఇది కష్టాల్లో ఉన్న, నిధుల కొరతతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈ రంగానికి ఊతమిస్తుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత క్రెడిట్ గ్యారెంటీ పథకం ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.
ఎంఎస్ఎంఈలు, వృత్తి నిపుణులకు పన్ను ప్రయోజనాలు
బడ్జెట్ 2023లో ఎంఎస్ఎంఈలు, వృత్తి నిపుణులకు పన్ను ప్రయోజనాలను కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే కొత్త సహకార సంఘాలు 15శాతం పన్ను ప్రయోజనం పొందవచ్చని నిర్మల వెల్లడించారు. రూ.2కోట్ల టర్నోవర్ కలిగిన సూక్ష్మ పరిశ్రమలు, రూ. 50లక్షల టర్నోవర్ కలిగిన వృత్తి నిపుణులు ఈ తక్కువ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చని ఆమె చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తయారీ కేంద్రాలను ప్రారంభించే సహకార సంస్థలు, ప్రస్తుతం అర్హత కగిలిన సంస్థలు ఈ 15శాతం పన్ను ప్రయోజనాన్ని పొందుతాయని పేర్కొన్నారు.