బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు
వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రంలో పాన్‌కార్టు అయితే ఇంకోచోట ఈపీఎఫ్‌ఓ లేదా జీఎస్టీఎన్, టీఐఎన్ లాంటి 20 రకాలను సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
పాన్‌కార్డు పరిధిని పెంచిన కేంద్ర ప్రభుత్వం
వ్యాపార అనుమతులు, లావాదేవీల విషయంలో వ్యాపారుల అవస్థలను గుర్తించిన కేంద్రం ఈ విధానంలో సంస్కరణలను తీసుకొచ్చింది. పర్మినెంట్ అకౌంట్ నంబర్( పాన్)ను యూనివర్సిల్ ఐడీగా చేస్తున్నట్లు బడ్జెట్‌లో భాగంగా ప్రకటించింది. పాన్ కార్డును యూనివర్సిల్ ఐడీగా మార్చడం వల్ల ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారికీ చాలా ఈజీ కానుంది. సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుంది. అంతేకాదు వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం మరింత సులభతరం కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్నాళ్లు పాన్ కార్డు కేవలం ఆదాయ పన్ను చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడేది. ఇప్పుడు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా పాన్ ఉండాల్సిందే.