Education Budget 2023: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్, బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఇవే
2023-2024 బడ్జెట్‌లో విద్యారంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విద్యారంగంలో నూతనోత్సాహాన్ని నింపేందుకు బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు. అని రకాల పుస్తకాల లభ్యతను సులభతరం చేయడానికి యువత, పిల్లల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలల్లో వచ్చే మూడేళ్లలో 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది నియామకం మహమ్మారి సమయంలో కోల్పోయిన అభ్యాస సమయాన్ని భర్తీ చేయడానికి చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో పుస్తకాల పంపిణీ.
కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ల్యాబ్‌లలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించడానికి కొత్త కార్యక్రమం కూడా ప్రవేశపెట్టనున్నారు. కొత్తగా 157 కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ అవకాశాల కోసం యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలలో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.