కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 35ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ చరిత్ర సృష్టించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
1978 నుంచి 35 ఏళ్ల పాటు వామపక్షాలు త్రిపురను పాలించినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు హత్యలు, హింసకు పాల్పడ్డారని, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వబోమని చెప్పారు.
సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమం కోసం బీజేపీ పని చేస్తుందని మాణిక్ సాహా పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయని చెప్పారు.
త్రిపుర
36 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాం: మాణిక్ సాహా
కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే ప్రచారానికి ఆ పార్టీ నాయకులు రావట్లేదని మాణిక్ సాహా పేర్కొన్నారు. బీజేపీ ఒక కుటుంబమని ఎన్నికల సమయంలో అందరు నాయకులు వచ్చి ప్రచారం చేస్తారని చెప్పారు.
అధికారం కోసం రాజకీయాలు చేయటం లేదని, సామాజిక మార్పు కోసమే పనిచేయాలని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని మాణిక్ పేర్కొన్నారు. మోదీ మాటలను నిజం చేస్తూ సమాజంలోని చివరి మనిషి కోసం పనిచేస్తున్నామని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నా, రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సారి 36కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.