Devendra Fadnavis: రూ.500 కోట్లతో సిద్ధివినాయక ఆలయానికి మేకోవర్.. పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సిద్ధివినాయక దేవాలయం పునర్వ్యవస్థీకరణ పనుల తొలి దశను అధికారికంగా ప్రారంభించారు. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా దేశంలో అత్యధికంగా భక్తులు సందర్శించే ఆలయాల్లో ఒకటైన సిద్ధివినాయక ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆలయ ట్రస్టు సభ్యులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక సిద్ధివినాయక ఆలయ సముదాయం ఎలా ఉండబోతుందో చూపిస్తూ ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదిక Xలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు.
వివరాలు
తొలి దశ పనులు ప్రారంభం
శ్రీ సిద్ధివినాయక ఆలయ సముదాయం రూపాంతరానికి సిద్ధమవుతోందంటూ "గణపతి బప్పా మోరియా అని పేర్కొన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సమక్షంలో భూమిపూజ నిర్వహించడంతో సిద్ధివినాయక కారిడార్ ప్రాజెక్ట్ తొలి దశ అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపారు. సుమారు రూ.500 కోట్లతో రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ ప్రధాన లక్ష్యం ఆలయ పరిసరాలను ఆధునికీకరించడం, భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించడం, అలాగే భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడం అని అధికారులు వెల్లడించారు
వివరాలు
మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుండటంతో మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తొలి దశలో భాగంగా కొత్త ప్రవేశ ద్వారాల నిర్మాణం, ఆలయం లోపలి మరియు బయటి గోడలకు కొత్త రాతి పనులు, అలాగే 124 వాహనాలు నిలిపే సామర్థ్యం గల రెండు అంతస్తుల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.