North India: ఉత్తర భారత్‌ను వణికిస్తున్న చలి.. దిల్లీలో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారతమంతటా శీతాకాలం తన పట్టును ఆదివారం మరింత బిగించింది. దిల్లీలో పగటి వేడి గణనీయంగా తగ్గగా, రాజస్థాన్‌లో అనేక ప్రాంతాల్లో ఘనమైన పొగమంచు అలుముకొని రహదారులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు సున్నా స్థాయి కంటే దిగజారడంతో,రాబోయే రోజుల్లో అక్కడి ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా మంచు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)అంచనా వేసింది. శ్రీనగర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 3.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా,గుల్‌మార్గ్‌లో మైనస్ 6.5, పహల్గాంలో మైనస్ 5 డిగ్రీల వరకు పడిపోయింది. దిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 17.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై, ఇది సీజన్ సగటుతో పోలిస్తే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది.
వివరాలు
దిల్లీలో వాయు నాణ్యతా సూచీ 307గా నమోదు
కనిష్ఠ ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలుగా ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 6వ తేదీ వరకు చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సాయంత్రం నాలుగు గంటల సమయంలో దిల్లీలో వాయు నాణ్యతా సూచీ తీవ్రంగా దిగజారి 307గా నమోదైంది. మరోవైపు, రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా ఫతేపుర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో సోమవారం, మంగళవారం రోజుల్లో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో గుజరాత్‌లో రాబోయే అయిదు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగవచ్చని ఐఎండీ తెలిపింది.