Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో చెక్‌డ్యాంల నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. నాబార్డు నిధులతో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన పనుల్లో మూడోవంతు మాత్రమే పూర్తి అయ్యాయి.
నాబార్డు హై పవర్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో చెక్‌డ్యాంల నిర్మాణాలు, రుణాలపై చర్చ జరిగింది.
రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ నిధులతో అమలు చేస్తున్న పథకాలు, రుణాల వినియోగంపై కమిటీలో చర్చలు జరిగాయి.
2019లో చెక్‌డ్యాంల నిర్మాణానికి ఆమోదం ఇచ్చిన ప్రభుత్వం, నాబార్డు ఆర్థిక సాయంతో మొదటి విడతలో 638 నిర్మాణాలు చేపట్టింది.
Details
ఆర్‌ఐడీఎఫ్ నిధుల ద్వారా చెక్‌డ్యాంల నిర్మాణాలకు రుణాలు
ఆర్‌ఐడీఎఫ్ నిధుల ద్వారా 484 చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.2,013.75 కోట్ల రుణం కేటాయించారు.
వీటిలో 334 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 150 పనులు వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్నాయి.
పూర్తి అయిన పనులకు రూ.1,609 కోట్ల చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం 638 చెక్‌డ్యాంలకు అనుమతులు జారీ చేయడంతో, 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 392 మాత్రమే పూర్తయ్యాయి.
మిగిలిన 246 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో రెండో విడతలో 562 పనులు చేపట్టాలని నిర్ణయించారు.
Details
రెండో విడతకు 2వేల కోట్ల ఖర్చు
రెండో విడతకు రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.
కానీ మొదటి విడత పనులు పూర్తి చేయలేక పోయిన దశలో రెండో విడత పనులు పెండింగ్‌లో పడ్డాయి. అసంపూర్తిగా మిగిలిన పనులకు నాబార్డు నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది.
పనులు పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడంతో మరికొన్ని పనులకు నిధులు మంజూరు కాలేదు.
ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేయడం ద్వారా మిగిలిన నిధులు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.