
Nitin Gadkari: దిగుమతులను తగ్గించుకొని..ఎగుమతులను పెంచుకోవాలి.. జాతీయవాదంలో ముఖ్యమైనది ఇదే : గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఎగుమతులను పెంచుకొని దిగుమతులను తగ్గించుకోవడమే జాతీయవాదంలో ముఖ్యమని కేంద్ర రోడ్డు రవాణ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏ దేశం అయినా విజ్ఞానం, పరిశోధనల్లో ముందడుగు వేస్తే అది ప్రపంచంలో 'విశ్వగురు' స్థాయికి చేరుతుందన్నారు. విద్యను సృజనాత్మకతతో అనుసంధానించడం అత్యవసరమని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ''భారతదేశాన్ని విశ్వగురు స్థాయికి తీసుకు వెళ్లాలంటే విజ్ఞానం అత్యంత కీలకమని నేను భావిస్తున్నాను.ప్రపంచంలో ఏ దేశమైన ముందుకు వెళ్లిందంటే దానికి కారణం విజ్ఞానం, పరిశోధనలే. రక్షణ, వ్యవసాయం, ఐటీ రంగాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి'' అని చెప్పారు. గతంలో యుద్ధాలు సైనికులు, ట్యాంకులతో జరిగేవాయని, కానీ ఈ రోజుల్లో డ్రోన్లు, మిసైల్స్ వంటి ఆధునిక సాంకేతికత వచ్చినందున, వ్యూహాలు కూడా విజ్ఞానంపై ఆధారపడుతున్నాయి అని గడ్కరీ సూచించారు.
వివరాలు
ప్రపంచం భారత సంస్కృతి, వారసత్వం, యోగాపై ఆసక్తి
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు ట్రిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యాన్ని సాధించి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని భావిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి, విజ్ఞానం, పరిశోధనలపై దృష్టి పెట్టడమే కాక, విద్యను మన దైనందిన జీవితం, అభ్యాసాలకు అనుగుణంగా ఉండేలా చూడడం అత్యంత అవసరమని గడ్కరీ పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని ఆయన అన్నారు. మనం దిగుమతులపై ఆధారపడకుండా, వాటిపై పరిశోధనలు చేసి, బయట నుంచి కొనుగోళ్లను తగ్గిస్తూ, ఎగుమతులను పెంచే విధానంలో ముందడుగు వేయాలని గడ్కరీ సూచించారు. అంతేకాక, ప్రపంచం భారతీయ సంస్కృతి, వారసత్వం, యోగా మీద గాఢమైన ఆసక్తి చూపుతుందని కూడా పేర్కొన్నారు.