Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తాంధ్రలో ఆరుగురు మృతి, భారీగా పంట నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
అతి తీవ్ర తుపాను అర్నబ్ కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పెనుగాలులకు వేలాది చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. వేర్వేరు ఘటనల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతి చెందగా, కాలువ దాటేందుకు ప్రయత్నించిన ఓ ఏఎన్‌ఎం గల్లంతయ్యారు.
వివరాలు
ఉదయం 8 గంటల వరకు తీరందాటే ప్రక్రియ
తుపాను తీరం దాటే ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగింది.
నరసాపురానికి తూర్పు ఈశాన్యంగా 20 కి.మీ., యానాంకు నైరుతిగా 40 కి.మీ., కాకినాడకు నైరుతిగా 60 కి.మీ. దూరంలో తీరం దాటింది.
ఈ సమయంలో గంటకు 125 నుంచి 150 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.
బుధవారం ఉదయం 11.30 గంటల తర్వాత తీవ్ర తుపానుగా బలహీనపడిన అర్నబ్ సాయంత్రానికి తుపానుగా, అర్ధరాత్రికి తీవ్ర వాయుగుండంగా మారింది.
గురువారం ఉదయానికి వాయుగుండంగా, రాత్రికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వివరాలు
చిగురుటాకులా వణికిన పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
భీమవరంలో చెట్టు, విద్యుత్తు స్తంభం మీద పడటంతో సీహెచ్ కిశోర్‌కుమార్ (46) మృతి చెందారు.
సిద్ధాంతంలో రెండు ఇళ్లపై చెట్లు పడ్డాయి. యలమంచిలి మండలంలో పశువుల పాకలు కూలి రెండు గేదెలు చనిపోయాయి.
లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 350 మందిని 24 పునరావాస కేంద్రాలకు తరలించగా, 22 మంది గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
జిల్లాలో 550కి పైగా విద్యుత్తు స్తంభాలు, 5 వేలకుపైగా చెట్లు కూలిపోయాయి.
2.25 లక్షల ఎకరాల్లో సాగుచేసిన వరి పంటలో 70 శాతానికిపైగా నేలవాలింది. ఉద్యాన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.
భీమవరం, నరసాపురం రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారాల పైకప్పులు ఎగిరిపోగా, పలు రైళ్లను రద్దు చేశారు.
వివరాలు
కొబ్బరి చెట్లు, బోట్లు ధ్వంసం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9,527 విద్యుత్తు స్తంభాలు నేలకూలగా, 1.18 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది.
కోనసీమలో 450 ఫైబర్ బోట్లు దెబ్బతిని సుమారు రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. 46,500 కొబ్బరి చెట్లు దెబ్బతినగా, 8 వేల హెక్టార్లలో అరటి పంట నేలకొరిగింది.
కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్‌రోడ్డులో వాకలపూడి నుంచి ఉప్పాడ వరకు సుమారు 12 కి.మీ. మేర రహదారి ధ్వంసమైంది.
62 పునరావాస కేంద్రాల్లో 11 వేల మందికిపైగా ఆశ్రయం పొందారు.
49 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా, 230 యాంత్రిక బోట్లు, 430 వలలు నష్టపోయాయి. నాలుగు బార్జీల లంగర్లు తెగిపోయాయి.
వివరాలు
పోలవరం జిల్లాలో
పోలవరం జిల్లాలో 1,874 చెట్లు కూలిపోగా, 1,687 చెట్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.
రాజవొమ్మంగిలో అత్యధికంగా 11.98సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు గంటకు 50-60కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా,దెబ్బతిన్న ఉద్యాన పంటలకు వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ కె.ధనుంజయరావు సూచించారు.
రాష్ట్రంలోని 13ఉమ్మడి జిల్లాల్లో 114మండలాల పరిధిలోని 715గ్రామాల్లో 12,899హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఇందులో 8,471హెక్టార్ల అరటి, 2,628 హెక్టార్ల కూరగాయలు, 431 హెక్టార్ల పసుపు, 376 హెక్టార్ల బొప్పాయి, 277 హెక్టార్ల కొబ్బరి పంటలు ఉన్నాయి.