Cyclone Murasu: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఓడరేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం,వాడరేవు హార్బర్లలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. మచిలీపట్నంలో 9వ నంబర్, కృష్ణపట్నంలో 8వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, భీమునిపట్నం,గంగవరం,కాకినాడ,కళింగపట్నం ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బాపట్ల జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు, సందర్శకులు రావొద్దని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
వివరాలు
గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా మురసు తుపాను
ప్రజలు అత్యవసర సమయంలో గుంటూరు జిల్లాకు 9440827526, బాపట్ల జిల్లాకు 9281413774 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
మరోవైపు మురసు తీవ్ర తుపాను గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది.
ప్రస్తుతం నెల్లూరుకు 110 కిలోమీటర్లు, కావలికి 130 కిలోమీటర్లు, తిరుపతికి 160 కిలోమీటర్లు, ఒంగోలుకు 170 కిలోమీటర్లు, బాపట్లకు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వివరాలు
నిజాంపట్నం హార్బర్‌లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
తుపాను దక్షిణ తీర ప్రాంతం వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
మురసు తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాను ముప్పు నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్‌లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వివరాలు
పలు రైలు సర్వీసులు రద్దు
మురసు తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె మార్గాల్లో నడిచే పలు రైళ్లను సోమ, మంగళవారాల్లో రద్దు చేసింది.