Cyclone Murusu: మురసు తుపాను బీభత్సం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
మురసు తుపాను ఆంధ్రప్రదేశ్'లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. వాగులు,వంకలు పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో సగటున 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లమడ, ఓగేరు, ఎర్రవాగులకు గండ్లు పడి పంట పొలాలు మునిగాయి. కొమ్మమూరు కాలువ, గుంటూరు వాహినికి పలుచోట్ల గండ్లు పడ్డాయి. చెరువులు, కాలువలు, వాగుల శాశ్వత మరమ్మతులకు రూ.6.75 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. జిల్లాలో 38,062 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 17 చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. '
వివరాలు
పల్నాడు జిల్లాలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు
58 పునరావాస కేంద్రాల్లో 4,217 మందికి ఆశ్రయం కల్పించారు. 55 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
మంగళగిరిలో శ్రీపానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాకారం కూలింది. వరదల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కాకుమానులో రెండు రోజుల్లో 26 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
గార్లపాడు, కొప్పర్రు గ్రామాలను వరద చుట్టుముట్టింది. పల్నాడు జిల్లాలో 8,158 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,457 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
యడ్లపాడు వద్ద గల్లంతైన ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సిబ్బంది వరదల్లో చిక్కుకోగా పోలీసులు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించాయి.
కాకినాడ, రాజమహేంద్రవరం, రాజానగరం ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కరప మండలంలో వరద నీటికి బ్యాలట్ పత్రాలు తడిసిపోయాయి.
వివరాలు
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఏలూరు జిల్లాలో పెదవాగు ప్రాజెక్టు రింగుబండ్ తెగిపోవడంతో వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది.
జీలుగుమిల్లిలో 39.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రౌతుగూడెం సమీపంలో 20 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు.
వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చర్యలు చేపట్టాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలతో రహదారులు, పోలింగ్ కేంద్రాలు మునిగిపోయాయి.
అల్పపీడనంగా బలహీనపడిన మురసు ఉత్తరం దిశగా కదులుతూ మరింత బలహీనపడనుంది.
గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నెల 12 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.