LOADING...
Rajasthan: పట్టపగలే చీకటి.. రాజస్థాన్‌ను వణికించిన భారీ ధూళి తుఫాన్!
పట్టపగలే చీకటీ.. రాజస్థాన్‌ను వణికించిన భారీ ధూళి తుఫాన్!

Rajasthan: పట్టపగలే చీకటి.. రాజస్థాన్‌ను వణికించిన భారీ ధూళి తుఫాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన భారీ తుఫాన్ బీభత్సం ఇంకా మరువకముందే రాజస్థాన్‌లో శనివారం ఇసుక తుఫాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. పట్టపగలే విరుచుకుపడిన ఈ ధూళి తుఫాన్ కారణంగా పలు ప్రాంతాలు దుమ్ము మేఘాలతో కప్పుకుపోయాయి. భారీ ఈదురుగాలుల ప్రభావంతో ఇసుక, ధూళి ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత పూర్తిగా తగ్గిపోవడంతో ప్రజలు కంటి ముందు ఏమీ కనిపించక ఇళ్లలోనే ఉండిపోయారు. ఇసుక తుఫాన్ కారణంగా రహదారులన్నీ ధూళితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తుఫాన్ అనంతరం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తోంది.

వివరాలు

బెంబేలెత్తిపోయిన ప్రజలు

అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన ఈ మార్పులతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీ గంగానగర్ జిల్లాలో దుమ్ము మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కమ్మేశాయి. అలాగే బికనీర్‌లో కూడా భారీ ధూళి తుఫాన్ ప్రకంపనలు సృష్టించింది. ఒక్కసారిగా వేగంగా వీచిన ఈదురుగాలులతో పెద్ద మొత్తంలో ధూళి గాలిలోకి ఎగసిపడటంతో నగరంలోని పలు ప్రాంతాలు దుమ్ము మేఘాలతో నిండిపోయాయి.

వివరాలు

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు

దీంతో అనేక ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు ముందున్న దారి కనిపించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల వాహనాలు హెడ్‌లైట్లు ఆన్ చేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని బలమైన ఈదురుగాలులు వీచాయి. అనంతరం భారీగా ధూళి ఎగసిపడుతూ ఆకాశాన్ని పూర్తిగా కమ్మేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ధూళి తుఫాన్లు సంభవించే సమయంలో అనవసర ప్రయాణాలు చేయవద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లాల్సి వస్తే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Advertisement