Page Loader
 Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి
కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి

 Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో ఒక భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. నాలుగు రోజులుగా అదృశ్యమైన వంశిక అనే 21 ఏళ్ల యువతి మృతదేహం బీచ్‌ ప్రాంతంలో కనిపించింది. ఈ విషయాన్ని కెనడాలో ఉన్న భారత హైకమిషన్ అధికారికంగా ధృవీకరించింది. అధికార వర్గాల ప్రకారం, వంశిక పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు కాగా, ఆమె ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు దేవిందర్‌ సింగ్‌ కుమార్తె. ఆమె రెండేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లింది. ఏప్రిల్‌ 25వ తేదీన, శుక్రవారం రాత్రి అద్దె ఇంటిని వెతకాలని బయటకు వెళ్లిన వంశిక ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు.

వివరాలు 

మృతదేహం సమీపంలోని బీచ్‌లో..

తన కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ ఉదయం మాట్లాడే అలవాటు ఉన్న వంశిక,ఆ రోజు నుంచి ఫోన్‌ చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారు పలుమార్లు ఆమెకు ఫోన్‌ చేసినా,ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండడంతో కెనడాలోని ఆమె సన్నిహితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో ఆమె మృతదేహం సమీపంలోని బీచ్‌లో గుర్తించబడింది. ప్రస్తుతం వంశిక మృతికి కారణాలపై స్పష్టత లేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈఘటనపై కెనడాలోని భారత రాయబారకార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతికి గల అసలైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారని రాయబారి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో,ఇటీవలే జరిగిన మరో విషాదకర సంఘటన కూడా ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు 

హమిల్టన్‌లోని బస్టాప్ వద్ద కాల్పులకు బలైన హర్‌సిమ్రత్‌ రంధావా

హర్‌సిమ్రత్‌ రంధావా అనే 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హమిల్టన్‌లోని బస్టాప్ వద్ద కాల్పులకు బలైంది. హర్‌సిమ్రత్‌ అక్కడి కాలేజీలో చదువుతూ ఉండగా, బస్టాప్‌లో వేచిచూస్తుండగా ఓ వ్యక్తి కారులో వచ్చి మరో వాహనంపై కాల్పులు జరిపాడు. అయితే, కాల్పుల్లో ఒక బుల్లెట్ హర్‌సిమ్రత్‌కు తగలడం వల్ల ఆమె అక్కడికక్కడే గాయపడి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా,అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే రాక్‌లాండ్‌ ప్రాంతంలో మరో భారతీయుడు కత్తి దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తి పేరు లేదా ఇతర సమాచారం ఇంకా బయటకు రాలేదు.ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.