Page Loader
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష, ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష, ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు

వ్రాసిన వారు Stalin
Jan 30, 2023
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022 ఏప్రిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అరెస్టయిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 121 ప్రకారం నిందితుడికి మరణశిక్ష విధించినట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రషన్ కుమార్ తెలిపారు. పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు నిందితుడికి సెక్షన్ 307 కింద జీవిత ఖైదు కూడా విధించబడినట్లు ఆయన చెప్పారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్ సిబ్బందిపై అహ్మద్ ముర్తాజా అబ్బాసీ దాడి చేశాడు. ఈ క్రమంలో అతడిని వెంబడించి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో సంబంధం ఉన్నట్లు గుర్తింపు

అహ్మద్ ముర్తాజా అబ్బాసీని విచారించిన క్రమంలో అతనికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రకారం, ముర్తాజా అబ్బాసీ ఐఎస్ కోసం పని చేస్తున్నాడు. ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. గోరఖ్‌పూర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాసీ 2015లో ఐఐటీ-ముంబయిలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం అబ్బాసీ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, చాలా మంది వైద్యులు వద్ద చికిత్స చేయించినట్లు చెబుతున్నారు. మానసిక ఆరోగ్య సమస్యల వల్లే అతని భార్యతో కూడా అబ్బాసీకి విడాకులైనట్లు పేర్కొన్నారు.