తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గత 10నెలల్లో 111మంది శిశువులు అనుమానాస్పద కారణాలతో మరణించారు. ఈ మరణాలపై లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ బృందం పరిశోధన చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్‌గంజ్‌లోని గర్భిణుల పాలల్లో పురుగుమందులు అవశేషాలను ఉండటం గమనార్హం. లక్నోలోని క్వీన్ మేరీ ఆసుపత్రి బృందం 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణుల నుంచి నమూనాలను సేకరించి శిశువుల మరణానికి గల కారణాలపై పరిశోధన చేసింది. ప్రొఫెసర్ సుజాతా దేవ్, డాక్టర్ అబ్బాస్ అలీ మెహందీ, డాక్టర్ నైనా ద్వివేది చేసిన పరిశోధన వివరాలు ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జనరల్‌లో కూడా ప్రచురించారు. మాంసాహారుల కంటే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో పురుగుమందుల అవశేషాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
శాఖాహారుల కంటే మాంసాహారుల్లో మూడు రెట్లు ఎక్కువ
గర్భిణుల పాలల్లో పురుగు మందుల అవశేషాలు ఎందుకున్నాయనే దానిపై పరిశోనధన బృందం ఆరా తీయగా, రసాయన వ్యవసాయమే కారణమని తేలింది. కూరగాయలు, పంటల్లో వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలను వినియోగిస్తారు. మాంసానికి వినియోగించే కోళ్లు, మేకలు, గొర్రెలు త్వరగా ఎదగడానికి సప్లిమెంట్లు, రసాయనాలను ఇంజెక్ట్ చేస్తారు. అందుకే మాంసాహారం తినే తల్లి పాలలో ఉండే పురుగుమందుల అవశేషాలు, శాఖాహార మహిళ కంటే మూడు రెట్లు ఎక్కువ అని మేరీ ఆసుపత్రి బృందం పరిశోధన తేల్చింది. శిశువుల మరణాలకు కారణం పురుగుమందుల అవశేషాలా? లేక మరేదైనా ఉండొచ్చా అనే కోణంలో విచారణ చేయడానికి సీడీఓ అధ్యక్షతన జిల్లా మేజిస్ట్రేట్ కమిటీని ఏర్పాటు చేశారు.