LOADING...
250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్‌లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
ఉత్తరప్రదేశ్‌లో 250 మెగావాట్ల సౌర ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్‌లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ (ex-cantonment)ప్రాంతంలో 250 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్రాజెక్టు,బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో కలిసి ఏర్పాటు చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దాదాపు 850 ఎకరాల ఖాళీగా ఉన్న రక్షణ శాఖ భూమిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ చేపడుతున్న తొలి సోలార్-ప్లస్-స్టోరేజ్ ప్రాజెక్టుగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖాళీగా ఉన్న రక్షణ శాఖ భూమిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశంలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచే దిశగా కీలక అడుగు పడిందని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

ప్రాజెక్టు అమలు బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థకి అప్పగింత 

పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు బ్యాటరీ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల రక్షణ సంస్థలకు దీర్ఘకాలిక ఇంధన భద్రత మరింత బలపడనుంది. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం పెంపు, సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, రక్షణ సంస్థలకు అవసరమైన విద్యుత్‌ను గ్రిడ్ నుంచి కొనుగోలు చేసే వ్యయం కూడా గణనీయంగా తగ్గి, దీర్ఘకాలంలో ప్రభుత్వానికి భారీగా ఆదా కానుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ (NTPC)కి అప్పగించారు. పోటీ విధానంలో టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

వివరాలు 

ఆర్మీ తో పాటు DGDE కూడా భాగస్వామ్యం

ప్రాజెక్టు అమలులో రక్షణ మంత్రిత్వ శాఖ సమీకృత ప్రధాన కార్యాలయం (ఆర్మీ)తో పాటు డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (DGDE) కూడా భాగస్వామ్యం కానున్నాయి. జాతీయ భద్రత, ఇంధన భద్రత, సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి పలు లక్ష్యాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రాజెక్టుగా దీనిని అధికారులు అభివర్ణిస్తున్నారు. రక్షణ శాఖ, ఎన్టీపీసీ, ఆర్మీ ప్రధాన కార్యాలయం, డీజీడీఈ సంయుక్తంగా పనిచేసి నిర్ణీత గడువులో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.

Advertisement

వివరాలు 

రక్షణ శాఖ భూమిలో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు

ప్రాజెక్టు పూర్తయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత, రక్షణ శాఖ భూమిలో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటిగా సీతాపూర్ సౌర విద్యుత్ కేంద్రం నిలిచే అవకాశం ఉంది. సౌర విద్యుత్‌తో పాటు బ్యాటరీ నిల్వ వ్యవస్థను సమన్వయం చేయడం ద్వారా రక్షణ శాఖ ఆస్తులను జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు ఎలా ఉపయోగించవచ్చో ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement