LOADING...
Dehradun: కోడలిని 10 నెలలు టాయిలెట్‌లో బంధించి చిత్రహింసలు.. ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన
కోడలిని 10 నెలలు టాయిలెట్‌లో బంధించి చిత్రహింసలు.. ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన

Dehradun: కోడలిని 10 నెలలు టాయిలెట్‌లో బంధించి చిత్రహింసలు.. ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో ఓ మహిళపై అత్తింటి వారు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కోడలిని దాదాపు పది నెలల పాటు టాయిలెట్‌లో బంధించి, శారీరకంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం, డెహ్రాడూన్‌కు చెందిన రాహుల్ ఖండూరితో అదే ప్రాంతానికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు 2025 ఫిబ్రవరిలో కవలలు జన్మించారు. రాహుల్ ఉద్యోగరీత్యా దిల్లీలో ఉంటుండగా, అతని భార్య అత్తామామలతో కలిసి దెహ్రాదూన్‌లో నివసిస్తోంది.

వివరాలు 

పది నెలలుగా ఆమెకు సరైన ఆహారం కూడా అందించలేదు 

బాధితురాలి తండ్రి బహుగుణ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది జులై నెల నుంచి తమ కుమార్తెతో మాట్లాడేందుకు అత్తింటి వారు అవకాశం ఇవ్వడం మానేశారు. కుమార్తెను కలవడానికి పలుమార్లు వెళ్లినా వివిధ కారణాలు చెబుతూ ఆమెను చూడనివ్వలేదని ఆరోపించారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఇటీవల ఆమె అత్తింటికి వెళ్లి పరిశీలించగా, టాయిలెట్‌లో కుమార్తెను నిర్బంధించి ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. గత పది నెలలుగా ఆమెకు సరైన ఆహారం కూడా అందించలేదని,కేవలం బియ్యం, మిర్చి, ఉల్లిపాయలు మాత్రమే తినేందుకు ఇచ్చేవారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతిరోజూ ఇనుప రాడ్లు, సీసాలు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా హింసించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాలు 

పోలీసుల అదుపులో భర్త,అత్తామామలు 

సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడల్లా భర్త రాహుల్ కూడా తన తల్లిదండ్రులతో కలిసి బాధితురాలిపై వేధింపులకు పాల్పడేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హింసల కారణంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే కుమార్తెను హత్య చేస్తామని అత్తింటి వారు బెదిరించినట్లు బహుగుణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి భర్తతో పాటు అత్తామామలను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement