Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం గాలి నాణ్యత దారుణంగా క్షీణించినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపింది. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచిక (AQI)448, జహంగీర్‌పురిలో 421, ద్వారకలో 435, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (T3)వద్ద 421 ఉందని సీపీసీబీ వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో శనివారం AQI 500 దాటిందని, ఇది చాలా ప్రమాదకరమైనదని పేర్కొంది. దిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ (ఎంసీడీ) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. శీతాకాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బహిరంగ దహనం, అక్రమ నిర్మాణాలు, కూల్చివేత వ్యర్థాలను రోడ్లపై డంపింగ్, ధూళిపై నిఘా ఉంచడానికి 1,119 అధికారులతో 517 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎంసీడీ ఒక ప్రకటనను వెలువరించింది.
కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ జాగ్రత్తలు అవసరం
కాలుష్యం నుంచి తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రజలు N95/99 మాస్క్‌లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ లేకపోతే తడి రుమాలును ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కలుషిత ప్రాంతాలకు దూరంగా ఉండాలి. విపరీతమైన పొగమంచు ఉన్నట్లయితే, పొగమంచు తగ్గే వరకు నడక లేదా జాగింగ్‌కు దూరంగా ఉండాలి. మధ్య వయస్కుల కంటే చిన్నపిల్లలు కలుషితమైన గాలికి ఎక్కువ ప్రమాదం. అందుకే కాలుష్య స్థాయిలు ఎక్కువగా ప్రాంతాల్లో 8 ఏళ్లలోపు పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలి. కాలుష్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఇంటి లోపల ఇండోర్ మొక్కలను నాటడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.