Page Loader
Delhi Politics: కేజ్రీవాల్‌కు భారీ షాక్‌.. ఎన్నికల ముందు ఆప్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
కేజ్రీవాల్‌కు భారీ షాక్‌.. ఎన్నికల ముందు ఆప్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

Delhi Politics: కేజ్రీవాల్‌కు భారీ షాక్‌.. ఎన్నికల ముందు ఆప్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
06:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో ఐదు రోజులలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections)పోలింగ్ జరగనున్న తరుణంలో దిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ(భాజపా)తో హోరాహోరీ పోటీ నెలకొన్న కీలక సమయంలో ఏడు మంది ఎమ్మెల్యేలు ఆమ్‌ ఆద్మీ పార్టీని వీడి వెళ్లారు. వారు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పాలం ఎమ్మెల్యే భావనా గౌర్‌, కస్తూర్బానగర్‌ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ తమ రాజీనామా లేఖలను ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు పంపించారు. 'మీపై, అలాగే పార్టీపై నాకున్న విశ్వాసం కోల్పోయాను. అందువల్లే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి' అని భావనా గౌర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

వివరాలు 

అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే అవకాశం లేదు 

అదే విధంగా, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, జనక్‌పురి ఎమ్మెల్యే రాజేశ్‌ రిషి, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌, ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే పవన్‌ శర్మ, బిజ్వాసన్‌ ఎమ్మెల్యే బీఎస్‌ జూన్‌ కూడా ఆప్‌కు రాజీనామా చేశారు. అయితే, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే అవకాశాన్ని వీరికి కల్పించకపోవడం గమనార్హం.