దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా..
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో విచారణ జరుగుతున్నా కొద్ది.. షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కారు కింద ఆ యువతి ఇరుక్కుపోయిందని తమకు తెలుసునని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కారు చక్రాల్లో అంజలి ఇరుక్కుపోయిందని తెలిసిన తర్వాత.. ఏం చేయాలో తెలియక.. కారును అదే ప్రాంతంలో నిందితులు చాలా సేపు నడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. శరీరాన్ని కదిలించడానికి చాలాసార్లు యూ టర్న్‌లు కూడా తీసుకున్నట్లు చెప్పారు. తమపై హత్య నేరం మోపుతారమోననే భయంతో ఇలా చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు వివరించారు.
బయటకు వచ్చిన పక్కటెముకలు
20ఏళ్ల అంజలి సింగ్ తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో అంజలి కాలు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమెను కారు దాదాపు 13కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో అంజలి మరణించగా.. ఆమె స్నేహితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 40గాయాలతో అంజలి మరణించినట్లు పోలీసులు తెలిపారు. కారు కింద ఇరుక్కొని రాపిడి జరిగి.. శరీరంపై చర్మం ఊడిపోయి.. ఆమె పక్కటెముకలు బయటకు వచ్చాయంటే ప్రమాద తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే కారు యజమాని అశుతోష్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఏడో నిందితుడు అంకుష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.