Page Loader
ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ
ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ

వ్రాసిన వారు Stalin
Mar 15, 2023
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కవిత తరపు న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. మహిళను విచారించడానికి ఈడీ ఆఫీస్‌కు పిలవడంపై కవిత పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

కవిత

ఈడీ చెప్పిన విధంగా విచారించడం లేదు: న్యాయవాది

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించాలని ఈడీ భావిస్తోందని, అయితే ఈడీ ఆ పని చేయలేదని కవిత తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కవిత ఎందుకు కోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 16వ తేదీన ఈడీ విచారణ మరోసారి ఉందని సమాధానం చెప్పారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌ను మార్చి 24న విచారించాలని నిర్ణయించింది. అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇప్పటికే తాను కవిత బినామీ అని వాంగ్మూలంలో చెప్పారు. ఆమె చెప్పినందు వల్లే తన ఖాతాలోకి 32కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు కూడా తన ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు.