High Alert in Delhi: దిల్లీలో హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలతో పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టర్లలో ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచారు. వీరిలో ఎవరైనా కనిపించినా.. వారి ఆచూకీ గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
ఎర్రకోట వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు
ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన వేదికైన ఎర్రకోట వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
వేడుకల సమయంలో 15 వేల నుంచి 20 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎర్రకోట, పరిసర ప్రాంతాల్లో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వీటి ద్వారా కీలక ప్రాంతాల్లో జరిగే కదలికలను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఇందుకోసం మూడు కిలోమీటర్లకు పైగా పరిధిలోని పరిస్థితులను గమనించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
వివరాలు
స్నైపర్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థతో నిఘా
ఎర్రకోట పరిసరాల్లోని ఎత్తైన భవనాలపై స్నైపర్లను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే డ్రోన్ల ద్వారా జరిగే అనుమానాస్పద కదలికలను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిపటాలు, డ్రోన్లు ఎగరేయడంపై ఆంక్షలు విధించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా సంస్థలు అన్ని కోణాల్లోనూ నిఘాను పెంచుతున్నాయి.