'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఏపీలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై పార్లమెంటులో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకీ రైల్వే కేటాయింపులు పెరిగాయి: కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో 70,594 కోట్లతో 5,581 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2022 ఏప్రిల్ నెల వరకు రాష్ట్రంలో 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు, మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు. మార్చి 2022 వరకు 19,414 కోట్లతో 636 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే( 2014-2019) రైల్వే బడ్జెట్‌లో 219 శాతానికి పైగా కేటాయింపులు పెరిగాయని మంత్రి సమాధానమిచ్చారు.