తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు మార్గాల్లో హైస్పీడ్ రైలు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు వెళ్లొచ్చు. రెండోది కర్నూలు నుంచి విజయవాడ వరకు ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో దాదాపు 220 కిలోమీటర్ల స్పీడుతో రైలును నడపాలని రైల్వైశాఖ ఆలోచిస్తోంది.
హైస్పీడ్ రైలు కారిడార్ కోసం ప్రత్యేక లైన్లు
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు, కర్నూలు నుంచి విజయవాడ వరకు వెళ్తున్న రైళ్లు గరిష్ఠంగా 150కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడు వెళ్లలేవు. అందుకే హైస్పీడ్ రైలు కారిడార్ కోసం ప్రత్యేకంగా లైన్లు వేయాలని రైల్వేశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అధ్యయనానికి ఇప్పటికే టెండర్లను రైల్వైశాఖ ఆహ్వానించింది. అధ్యయనం పూర్తవడానికి కనీసం 6నెలల సమయం పడుతుంది. అధ్యయనం పూర్తయ్యాక టెండర్ దక్కించుకున్న సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంత ఖర్చు అవుతుందనేది తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాయలసీమ ప్రజలు చాలా తక్కువ సమయంలోనే విజయవాడకు చేరుకుంటారు. అలాగే హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణం గణనీయంగా తగ్గనుంది. కేవలం నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోవచ్చు.