ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మోసం చేసిన వ్యక్తిని ముంబయి సైబర్ సెల్ విభాగం-ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఒడిశా సరిహద్దలో శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని బుడుమూరు నాగరాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బుడుమూరు నాగరాజు మాజీ రంజీ ప్లేయర్ కావడం గమనార్హం.
మోసం ఇలా బయటపడింది
అంతకుముందు సీఎం జగన్ పేరు చెప్పి చాలా మందిని మోసం చేసిన నాగరాజు.. ఇటీవల ముంబయిలోని ఓ ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయదారుడికి ఫోన్ చేశాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఎండీ నంబర్ కనుక్కొని తాను ఆంధ్రప్రదేశ్ సీఎంగా పరిచయం చేసకున్నారు. క్రికెటర్ కిట్ స్పాన్సర్‌షిప్ కోసం పరిశ్రమ ఎండీని రూ.12లక్షలు అడిగినట్లు అధికారులు చెప్పారు. ఈ పని చేస్తే తగిన ప్రతిఫలం ఉంటుందని కూడా చెప్పాడు. ఇది నమ్మిన ఎండీ రూ.12లక్షలను అతడి అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత నాగరాజు ఇచ్చిన ఫోన్ నంబర్ పని చేయకపోవడం, క్రికెటర్ల పేర్లు నకిలీవని తేలడంతో తాను మోసపోయానని జనవరిలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఎండీ పోలీసులను ఆశ్రయించారు.