వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, 11.43శాతం గ్రోత్ రేటును సాధించినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-2023 ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపాన్యాసం చేశారు. ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని గవర్నర్ అన్నారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వాలంటరీ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు: గవర్నర్
అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటిని నవరత్నాలు గొడుగు కిందకు తీసుకొచ్చి.. పారదర్శకంగా అమలు చేస్తోందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేరవేస్తోందన్నారు. గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు. లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూర్చడం, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే మధ్యాహ్న భోజన పథకం, రూ.3,669తో పాఠశాలల ఆధునీకరణతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి గవర్నర్ సుదీర్ఘంగా మాట్లాడారు.