ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కానున్నాయి. తొలుత ఫిబ్రవరి 27 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్-2023 కారణంగా వాయిదా వేసింది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంగళవారం జరిగే బీసీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 17వ తేదీన ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, ఇటీవల పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు వంటి ముఖ్యమైన అంశాలను లేవనెత్తడానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సన్నద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని, ఈ సమావేశాల్లోనూ సభకు దూరంగా ఉంటానని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇది వరకు ప్రకటించారు.
ఉగాది నుంచి వైజాగ్ నుంచి సీఎం జగన్ పాలన
గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ మార్చి 14న అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తారు. మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు మార్చి 25 లేదా 27న ముగిసే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు ముఖ్యమంత్రి జగన్ మారుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తన నివాసాన్ని మార్చుకునే అంశం మూడు రాజధానుల కేసుకు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి లోబడి ఉండనుంది.