బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. పార్టీలో చేరిన తర్వాత ఆయనకు కీలక పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు.
కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
1989 సాధారణ ఎన్నికల్లో తొలిసారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలిచాడు. 1994 లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య వైఎస్‌కు కుడి భుజమైతే కిరణ్ కుమార్ రెడ్డి ఎడంభుజంగా ప్రసిద్ధి చెందారు. 2010లో నవంబరు 25న 16వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2014 ఫిబ్రవరి 19 వరకు పదవిలో కొనసాగారు.