IND vs NZ: నేడే భారత్-కివీస్ చివరి టీ20.. సంజూ ఫామ్‌పై ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 50 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలవడంతో, ఇవాళ జరగనున్న ఐదో టీ20పై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓడితే వరల్డ్‌కప్‌కు ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి తీవ్ర దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.
Details
ఉత్సాహంలో న్యూజిలాండ్
నాలుగో టీ20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ జట్టు భారత్‌పై విజయం సాధించింది. అదే జోరును కొనసాగించి సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించాలని కివీస్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధారించారు. ఓపెనర్లు సీఫర్ట్, డెవాన్ కాన్వేతో పాటు మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. ఈ నలుగురిని కట్టడి చేయగలిగితేనే భారత గెలుపు సాధ్యమవుతుంది. ఆ మ్యాచులో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం ఎలా రాణిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, శాంట్నర్‌లు టీమిండియా బ్యాటర్లకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
Details
సొంతగడ్డపై సంజూకు కీలక పరీక్ష
ఈ సిరీస్ ఆరంభం నుంచి సంజూ శాంసన్ ఫామ్ భారత జట్టుకు పెద్ద ఆందోళనగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లో అయినా అతడు తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. చివరి టీ20 అతడి సొంత నగరమైన తిరువనంతపురంలో జరగనుండటంతో, పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ఇది అతడికి మంచి అవకాశంగా మారింది. అలాగే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబేపై మరోసారి అందరి దృష్టి నిలిచింది. రింకూ సింగ్ మంచి ఫామ్‌లో కొనసాగుతుండగా, గత మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్‌కు చివరి టీ20లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
Details
పిచ్ పరిస్థితులు, రికార్డులు
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అదే సమయంలో స్పిన్నర్లకూ సహకారం లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో మూడు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తంగా ఈ సిరీస్‌ను విజయంతో ముగించాలంటే చివరి టీ20లో భారత్ జట్టు పూర్తి శక్తితో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.