LOADING...
Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశానికి సిద్ధమైన సమ్మక్క-సారలమ్మ
నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశానికి సిద్ధమైన సమ్మక్క-సారలమ్మ

Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశానికి సిద్ధమైన సమ్మక్క-సారలమ్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన మేడారం జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మలు గద్దెలపైకి చేరడంతో మేడారం ప్రాంతం మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు.

Details

పోటెత్తిన భక్తులు

వనం మొత్తం ఇసుక వేసినా రాలనంతగా ప్రజలు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి-మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణం అవుతున్నారు.

Details

మేడారంలో గందరగోళం

శుక్రవారం సక్కమ-సారలమ్మలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం ప్రారంభించిన సమయంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో నిన్న సాయంత్రం నుంచి బస్టాండ్‌లలోనే నిరీక్షించాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని గమనించిన ఆర్టీసీ అధికారులు అదనంగా మరిన్ని బస్సులను మేడారం జాతరకు పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో సమ్మక్కతల్లి గద్దెపైకి వచ్చింది.

Advertisement

Details

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు

ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు మూడు నుంచి నాలుగు రోజులుగా ఎదురు చూసిన భక్తులు ఒక్కసారిగా గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో టీటీడీ భవనం పక్కనున్న సాధారణ, వీఐపీ, వీవీఐపీ క్యూలైన్ల నుంచి జంపన్న వాగు, ఆర్టీసీ జంక్షన్ వైపు స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇదే సమయంలో రెండు సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ భక్తుల మధ్య చిక్కుకుని ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రద్దీ మధ్యగా వెళ్తున్న వీఐపీ వాహనాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Details

నేటితో ముగియనున్న మహా జాతర

మేడారం మహా జాతర ఈ నెల 28న ప్రారంభమై ఈరోజు (జనవరి 31)తో ముగియనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. అనంతరం 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం నలుగురు దేవతలు భక్తులకు దర్శనమివ్వగా, తల్లులు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ నలుగురు దేవతలు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో మేడారం మహా జాతరకు అధికారికంగా ముగింపు పలకనున్నారు.

Advertisement