కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నట్లు, అది దక్కకపోవడంతో బాధ, అశాంతితో ఆయన మోదీ, బీజేపీని విమర్శిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్‌వీ సుభాష్ అన్నారు.
తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ అదానీ సంక్షోభం విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికపై మోదీ మౌనాన్ని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ.. ప్రధానమంత్రి మనిషని చెప్పారు. ప్రధాని బెదిరింపు వ్యూహాలు తెలంగాణలో పనిచేయవని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీ
కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు: బీజేపీ
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎన్‌వీ సుభాష్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారని, కేటీఆర్ ఆ విషయాల గురించి మాట్లాడలేడు కాబట్టి, ప్రధాని మోదీ, గౌతమ్ అదానీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాన మంత్రికి 'లై డిటెక్టర్' పరీక్ష చేయించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారని ఎన్‌వీ సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం అబద్ధాల పాఠశాలను నడుపుతోందని, వారికే 'లై డిటెక్టర్' పరీక్ష చేయించాలన్నారు. కేటీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పే పాఠశాల ఉందని, దానికి కేసీఆర్ ప్రిన్సిపాల్ అని ఆయన అన్నారు.