LOADING...
T20 World Cup: కెనడాపై దక్షిణాఫ్రికా భారీ విజయం
కెనడాపై దక్షిణాఫ్రికా భారీ విజయం

T20 World Cup: కెనడాపై దక్షిణాఫ్రికా భారీ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

గత టీ20 ప్రపంచకప్‌ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈసారి టోర్నీలో ఘనంగా అడుగుపెట్టింది. సోమవారం గ్రూప్‌ 'డి'లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కెనడాపై 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతను 32 బంతుల్లో 59 పరుగులు చేయగా, ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. కెనడా బౌలింగ్‌లో అన్‌డ్‌ష పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కెనడా పోరాడినా చివరకు ఓటమిని తప్పించుకోలేకపోయింది.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన మార్క్రమ్

20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసి పరాజయం పాలైంది. నవనీత్‌ దలివాల్‌ 49 బంతుల్లో 64 పరుగులతో అర్ధసెంచరీ సాధించగా, హర్‌ష ఠాకెర్‌ 29 బంతుల్లో 33 పరుగులు చేసి రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో లుంగి ఇన్‌గిడి నాలుగు వికెట్లు పడగొట్టగా, మార్కో యాన్సెన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్లు మార్క్‌రమ్‌, క్వింటన్‌ డికాక్‌ కెనడా బౌలర్లపై ఎదురులేని దూకుడు ప్రదర్శించారు. మార్క్‌రమ్‌ వరుస బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచడంతో 4.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. డికాక్‌ 22 బంతుల్లో 25 పరుగులు (2 ఫోర్లు) చేసి అవుట్‌ అయిన తర్వాత ర్యాన్‌ రికెల్టన్‌ కెప్టెన్‌కు జత కలిశాడు.

Details

చివర్లో విజృంభించిన డేవిడ్ మిల్లర్

రికెల్టన్‌ 21 బంతుల్లో 33 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్‌) చేయగా, ఇద్దరూ కలిసి పదో ఓవర్‌ పూర్తికాకముందే స్కోరును 100 దాటించారు. మార్క్‌రమ్‌ 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే మార్క్‌రమ్‌, రికెల్టన్‌, బ్రెవిస్‌ (6) పెవిలియన్‌కు చేరారు. చివరి ఓవర్లలో డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా స్కోరు 200 పరుగులు దాటింది.

Advertisement

Details

రాణించిన నవనీత్‌ దలివాల్

దక్షిణాఫ్రికాలాంటి బలమైన జట్టుపై 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం సవాల్ గా మారింది. లుంగి ఇన్‌గిడి బౌలింగ్‌ దెబ్బకు ఆరంభంలోనే కెనడా కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ (12), నికోలస్‌ కిర్టన్‌ (4) త్వరగా వెనుదిరిగారు. నవనీత్‌ దలివాల్‌, హర్‌ష ఠాకెర్‌ ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరును 100 పరుగులకు చేర్చారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం హర్‌ష ఠాకెర్‌ అవుట్‌ అయ్యాడు. నవనీత్‌ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని చివరి ఓవర్లో అవుట్‌ కావడంతో కెనడా పోరాటం అక్కడితో ముగిసింది.

Advertisement