'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం
భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. భారత ప్రజాస్వామ్యం, రాజకీయాలు, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రత విషయంలో విదేశీ జోక్యాన్ని కోరుతూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశానికి సిగ్గు చేటన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాహుల్ గాంధీ మాటలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ మద్దతు తెలుపుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. లేని పక్షంలో రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టు ఆలోచనా విధానంతో మాట్లాడుతున్న రాహుల్
లండర్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ కేంద్రంపై మాటల దాడికి దిగుతున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అమెరికా, యూరప్‌లు తగినంత కృషి చేయడం లేదని, ఎందుకంటే అవి భారత్ నుంచి వాణిజ్యం, డబ్బును పొందుతున్నాయని అన్నారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యాతారాహిత్యంగా ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ పూర్తిగా మావోయిస్టు ఆలోచనా విధానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. చైనా సమస్యపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలన్నింటినీ తాము ఖండిస్తున్నట్లు చెప్పారు.