Telangana: ప్యూచర్ సిటీ, గ్రామీణాభివృద్ధి కోసం.. అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారంతో 'బ్లూ అండ్ గ్రీన్', 'మొబిలిటీ' ప్రణాళికలు
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన విధానపరమైన అంశాలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నగర విస్తరణను దృష్టిలో ఉంచుకొని, త్వరలో నిర్మించబోయే ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) పరిధిలోని 12,000 చదరపు కిలోమీటర్ల భూభాగానికి మహా ప్రణాళిక రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైంది.
అలాగే, కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీతో పాటు, ఆర్‌ఆర్‌ఆర్‌కు అవతల ఉన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు.
వివరాలు
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం
ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) వరకూ ఉన్న ప్రాంతాన్ని కోర్ ఏరియాగా గుర్తించి, దాని నుండి కొత్తగా నిర్మించబోయే ఆర్‌ఆర్‌ఆర్‌కు రెండు కిలోమీటర్ల వరకు ఉన్న భూభాగాన్ని అర్బన్‌గా, ఆ మరింత అవతల ఉన్న ప్రాంతాన్ని రూరల్‌గా విభజించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఓఆర్‌ఆర్ మరియు ఆర్‌ఆర్‌ఆర్ మధ్య భాగంలో ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా 'ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ' (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ అథారిటీకి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు చేయనున్నారు.
ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక వాడలు, ఐటీ పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వివరాలు
ప్రారంభ దశలోనే పరిష్కరించే విధంగా ప్రణాళిక
అత్యధిక జనాభా కలిగిన కోర్ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, మురుగు నీరు, తాగునీటి వంటివి ప్రధాన సమస్యలుగా ఉంటాయి.
అర్బన్ ప్రాంతాల్లో పెరుగుతున్న నగరీకరణను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మౌలిక వసతులు ముందుగా కల్పించాలి.
ఈ సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది.
జనాభా పెరుగుదలతో పాటు మౌలిక వసతుల విస్తరణను ముందస్తుగా ప్రణాళికబద్ధంగా అమలు చేయకుంటే, ప్రతీ నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు తాగునీటి, మురుగునీటి పైపులైన్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వివరాలు
కొత్త నీటి వనరులను అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక
కోర్ ప్రాంతంతో పాటు అర్బన్ ప్రాంతం మరియు ఆర్‌ఆర్‌ఆర్ వరకూ విస్తరించే భూభాగానికి 2050 సంవత్సరానికి తగిన మహా ప్రణాళిక రూపొందించబడుతోంది.
అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహాయంతో 'బ్లూ అండ్ గ్రీన్', 'మొబిలిటీ' ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
జల వనరులను సంరక్షించడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం కోసం చెరువులు, కుంటల పరిరక్షణ, పార్కుల అభివృద్ధి వంటి చర్యలను చేపట్టనున్నారు.
అదనంగా, కొత్త నీటి వనరులను అభివృద్ధి చేయడం కోసం మరొక ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.
వివరాలు
వ్యవసాయం ఉత్పాదకతను రెట్టింపు చేయడానికి చర్యలు
'మొబిలిటీ' ప్రణాళిక ప్రకారం, 2050 నాటికి కోర్ మరియు అర్బన్ పరిధిలో వాహనాల పెరుగుదల ఆధారంగా అవసరమైన రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర ప్రజారవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వాటి సహజత్వాన్ని కాపాడుతూ విద్య, వైద్యం వంటి ప్రాథమిక సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే, గ్రామీణ ప్రజల ప్రధాన జీవనాధారం అయిన వ్యవసాయాన్ని మెరుగుపరిచి, ఉత్పాదకతను రెట్టింపు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది.