'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్
ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ధర్మాన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేస్తామని చెప్పిన వారితో ఒట్టు వేయించుకోవాలని వాలంటీర్లకు సూచించారు. మీ పరిధిలోని ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనే విషయాన్ని గ్రహించాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల సెంటిమెంట్‌పై దెబ్బకొట్టాలన్న కోణంలో ధర్మాన మాట్లాడటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఓడిపోతే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయ్: ధర్మాన
అలాగే ఓటర్లను ఏ, బీ, సీ కేటగిరీలు విభజించాలని చెప్పారు. అందులో వైసీపీకి ఎవరు ఓటు వేస్తారు? ప్రతి పక్షాలకు ఎవరు ఓటు వేస్తారు? గోడ మీద పిల్లలు ఎవరు? ఈ మూడు విభాగాలుగా ఓట్లర్లను కేటగిరీగా విభజించాలని పేర్కొన్నారు. ఇందులో వైసీపీ ఓటు వేస్తామన్న వారితో తప్పుకుండా దేవుడి బొమ్మ మీద ఒట్టు వేయించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే వాలంటీర్ల ఉద్యోగాలు ఊడిపోతాయని మంత్రి చెప్పడం కొసమెరుపు.