Loading...
Driving Licence: డ్రైవింగ్ లైసెన్సుల్లో భారీ మార్పులు.. భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగులు
డ్రైవింగ్ లైసెన్సుల్లో భారీ మార్పులు.. భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగులు

Driving Licence: డ్రైవింగ్ లైసెన్సుల్లో భారీ మార్పులు.. భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

డ్రైవింగ్ లైసెన్సుల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. భారతీయులు, విదేశీయులను సులభంగా గుర్తించేందుకు వేర్వేరు రంగుల్లో లైసెన్సులు జారీ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన నిబంధనల సవరణకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొత్త విధానం అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సు కార్డుపై వాహనదారుడి జాతీయతను కూడా స్పష్టంగా ముద్రించనున్నారు.

వివరాలు 

నకిలీ పత్రాలకు చెక్‌.. నిబంధనలు కఠినతరం

లైసెన్సుల జారీలో నకిలీ పత్రాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు, మొత్తం ప్రక్రియను మరింత పారదర్శకంగా, కఠినంగా మార్చడం ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం.

ఇప్పటివరకు వయసు, చిరునామా ధ్రువీకరణ కోసం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ ముందు సమర్పించే అఫిడవిట్లు, జీవిత బీమా పాలసీలను ఇకపై ఆధారాలుగా అంగీకరించకూడదని ముసాయిదాలో పేర్కొన్నారు.

ఈ పత్రాల దుర్వినియోగాన్ని గుర్తించిన నేపథ్యంలో వాటిని తొలగించాలని ప్రతిపాదించారు.

వివరాలు 

ఆన్‌లైన్ పరీక్షలో పాస్ మార్కులు పెంపు

డ్రైవింగ్‌కు సంబంధించిన అవగాహనను పెంచేందుకు నిర్వహించే ఆన్‌లైన్ సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.

ఈ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు కొనసాగడం తప్పనిసరి చేయనున్నారు.

దీంతో లైసెన్సు పొందాలనుకునే వారు రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

లైసెన్సుపై మరిన్ని వివరాలు తప్పనిసరి

కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రతి డ్రైవింగ్ లైసెన్సుపై వాహనదారుడి బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వ్యక్తి వివరాలను తప్పనిసరిగా ముద్రించనున్నారు.

మరోవైపు, ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో పేరు, చిరునామా లేదా ఇతర వివరాలను మార్చుకునే వారికి సంబంధిత ఫీజుల నుంచి మినహాయింపు కల్పించాలని ప్రతిపాదించారు.

చిరునామా, వయసు ధ్రువీకరణకు ఆమోదయోగ్యమైన పత్రాలు

డ్రైవింగ్ లైసెన్సు జారీ, మార్పులకు సంబంధించి చిరునామా, వయసు, గుర్తింపును నిర్ధారించేందుకు సమర్పించాల్సిన పత్రాలపై కూడా ముసాయిదాలో స్పష్టత ఇచ్చారు.

చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఈ-రేషన్ కార్డు, ఇటీవల జారీ చేసిన విద్యుత్ లేదా గ్యాస్ బిల్లులను సమర్పించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

దరఖాస్తుల పరిష్కారానికి గడువులు

లైసెన్సులో మార్పుల కోసం సమర్పించిన దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రతిపాదించారు.

చిరునామా మార్పునకు సంబంధించిన దరఖాస్తులను 30 రోజుల్లోగా పూర్తి చేయాలి.

ఈ గడువు దాటినా చిరునామా మార్పు దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోతే, దానిని ఆటోమేటిక్‌గా ఆమోదించినట్లుగా పరిగణించాలని ముసాయిదాలో పేర్కొన్నారు.

ప్రజల అభిప్రాయాల తర్వాతే తుది నిర్ణయం

ప్రస్తుతం ఈ మార్పులన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ముసాయిదా నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలియజేయవచ్చు.

వాటిని పరిశీలించిన తర్వాత కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తుది నిబంధనలను ఖరారు చేయనుంది.

ADVERTISEMENT