Loading...
Supreme Court: విమానంలో వెళ్లకండి.. టికెట్ ధరల పెంపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
విమానంలో వెళ్లకండి.. టికెట్ ధరల పెంపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: విమానంలో వెళ్లకండి.. టికెట్ ధరల పెంపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ పరిణామాలు, పండగ సీజన్‌ ప్రభావంతో విమాన టికెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఛార్జీలను 700 శాతం పెంచడాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 'అయితే విమానంలో ప్రయాణించకండి' అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. విమాన టికెట్ ధరలు ఏకంగా 700 శాతం పెరగడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరిగింది. విమాన ప్రయాణాన్ని అత్యవసర సేవగా పరిగణించాలని, ఛార్జీల పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..'అయితే విమానంలో ప్రయాణించకండి'అని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే మరో కేసును విచారణకు స్వీకరించింది.

వివరాలు 

700 శాతం ధరల పెంపుపై మరో పిటిషన్

ఇదిలా ఉండగా, దేశంలోని పౌర విమానయాన రంగంలో పారదర్శకత పెంచేందుకు,ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు స్వతంత్రంగా వ్యవహరించే బలమైన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఎస్‌.లక్ష్మీ నారాయణన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుపుతోంది.

భారత విమానయాన సంస్థలు టికెట్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నాయని,అదనపు ఛార్జీలను ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

విమాన ఛార్జీల పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరారు.ఈ పిటిషన్‌ విచారణలో ఉండగానే తాజాగా 700 శాతం ధరల పెంపుపై మరో పిటిషన్‌ దాఖలైంది.

వివరాలు 

కొత్త నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

మరోవైపు, 'భారతీయ వాయుయాన్‌ అధినియమ్‌' చట్టం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది.

విమాన టికెట్ ధరలపై గరిష్ఠ పరిమితిని ఈ నిబంధనలు విధించకపోయినప్పటికీ.. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు అవసరమైతే జోక్యం చేసుకునే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తున్నాయి.

ADVERTISEMENT