Uttar Pradesh: యూపీలో హైడ్రామా.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రూ.100 నోట్లు విసిరి.. సినీ రేంజ్‌లో ఛేజింగ్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా సన్నివేశాలను తలపించేలా ఉత్తర్‌ప్రదేశ్‌లో డ్రగ్ స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న కారును పోలీసులు వెంబడిస్తుండగా, వారిని మభ్యపెట్టేందుకు నిందితులు కారులో నుంచి రూ.100 నోట్లు రోడ్డుపైకి విసిరారు. అయినప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోనిభద్ర జిల్లాలో ఇటీవల అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైవేపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో నిందితులు తమ కారుతో పోలీసుల వాహనాన్ని పలుమార్లు ఢీకొట్టడంతో అది నిలిచిపోయింది.
వివరాలు
పోలీసులపై కాల్పులు జరిపిన నిందితులు
అయితే అక్కడే ఉన్న ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి తన కారును పోలీసులకు అందించడంతో అధికారులు వెంటనే మళ్లీ ఛేజింగ్ ప్రారంభించారు. పోలీసుల దృష్టి మరల్చేందుకు నిందితులు కారులో నుంచి రూ.100 నోట్లను రోడ్డుపైకి విసిరారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకుండా వారిని వెంబడించి చివరకు వాహనాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరపగా, పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఘటనలో పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ప్రిన్స్ అనే నిందితుడు గాయపడగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
భారీగా డ్రగ్స్ స్వాధీనం
నిందితుల కారును తనిఖీ చేసిన పోలీసులు 3 కిలోల నల్లమందు, 225 కిలోల గసగసాల పొట్టు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు రూ.49 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేశారు. అరెస్టైన నిందితుడిని విచారించగా, ఝార్ఖండ్ నుంచి పంజాబ్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో కూడా పలుమార్లు ఇదే తరహాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిర్వహించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.