Southwest Monsoon: రుతుపవనాల జాడే లేదు.. తెలంగాణలో ఏప్రిల్‌ను తలపిస్తున్న 40 డిగ్రీల ఎండలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని, ఏప్రిల్ నెలను తలపించే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో గరిష్ఠంగా 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివరాలు
ఈ నెల 19వ తేదీ తర్వాత వర్షాలు
అలాగే వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నెల 15వ తేదీ వరకు ఇదే తరహా పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
అయితే ఈ నెల 19వ తేదీ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
ఈ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
ఇదిలా ఉండగా, రుతుపవన ద్రోణి ప్రస్తుతం శ్రీగంగానగర్, హిస్సార్, మీరట్, గోరఖ్‌పూర్ మీదుగా దక్షిణ అస్సాం వరకు విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.