Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో విషాదం.. మహిళా ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఓ మహిళా ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ వసుంధర ఎన్‌క్లేవ్‌లోని తన నివాసంలో మృతిచెందిన స్థితిలో కనిపించారు. ఈ ఘటనను పోలీసులు హత్యగా భావిస్తూ దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవోస్మిత పాల్ శివాజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా, దేవోస్మిత ఢిల్లీలోని సత్యం అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఆమె ఫోన్‌కు స్పందించకపోవడం, ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి ఉండటంతో ఆమె సోదరి దేవరితికి అనుమానం కలిగింది.
వివరాలు
హత్య కేసు నమోదు,దర్యాప్తు
దీంతో ఆమె ఫ్లాట్ వద్దకు వెళ్లి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, దేవోస్మిత విగతజీవిగా పడి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా, తలపై బలమైన వస్తువుతో దాడి చేయడం వల్లే ఆమె మరణించి ఉండొచ్చని గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తూ వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్‌బీఎస్ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు యథాతథంగా ఉండటంతో పాటు దోపిడీ జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.