Ebola: ఎబోలా అలర్ట్.. భారత్-ఆఫ్రికా మధ్య వారానికి 99 విమాన సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ), యుగాండలో ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మే 21న ఎబోలా వైరస్‌పై ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వ్యాప్తిని "పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్" (PHEIC)గా ప్రకటించింది. ప్రస్తుతం 600కుపైగా అనుమానిత కేసులు, 130 మరణాలు నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్-ఆఫ్రికా మధ్య ప్రస్తుతం వారానికి 99 విమాన సర్వీసులు నడుస్తుండటం వల్ల కేంద్రం అప్రమత్తమైంది.
వివరాలు
లక్షణాలు ఉంటే ఎయిర్ పోర్ట్ హెల్త్ అధికారులు సమచారం ఇవ్వాలి
డీఆర్‌సీతో నేరుగా ప్రయాణాలు పరిమితంగా ఉన్నప్పటికీ, ఉగాండాతో భారత్‌కు సుదీర్ఘకాల సంబంధాలు, అక్కడ పెద్ద సంఖ్యలో భారతీయ వలసదారులు ఉండటం వల్ల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, డీఆర్‌సీ, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు జ్వరం, బలహీనత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి లేదా అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే ఇమ్మిగ్రేషన్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఎబోలా అనుమానితులు లేదా బాధితుల రక్తం, శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు కూడా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.
వివరాలు
7 వేల మందికి పైగా ప్రయాణించారు
ప్రయాణం చేసిన 21 రోజుల లోపు లక్షణాలు కనిపించినా స్వీయ నిర్బంధంలో ఉండి వైద్య సహాయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అడ్వైజరీతో చాలామందికి COVID-19 ప్రారంభ దశ గుర్తుకొస్తోంది. మొదట పరిమిత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కేసులు, సాధారణ లక్షణాలతో ప్రారంభమైన కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారిన విషయం తెలిసిందే. భారత్‌కు ఉగాండాతో నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఉగాండా ఎయిర్‌లైన్స్ వారానికి మూడుసార్లు ఎంటెబ్బే, కంపాలా నుంచి ముంబైకి నేరుగా విమానాలు నడుపుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 7 వేలకుపైగా ప్రయాణికులు భారత్-ఉగాండా మధ్య ప్రయాణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
వారానికి నాలుగు చొప్పున సర్వీసులు
ఆఫ్రికా-భారత్ మధ్య అతిపెద్ద విమాన సర్వీసులు నడుపుతున్న సంస్థగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఈ సంస్థ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు వారానికి 38 విమానాలు నడుపుతోంది. కెన్యా ఎయిర్‌వేస్ నైరోబీ-ముంబై మధ్య వారానికి 10 విమానాలు నిర్వహిస్తోంది. ఈజిప్ట్ ఎయిర్ కైరో నుంచి ఢిల్లీ, ముంబైలకు వారానికి నాలుగు చొప్పున సర్వీసులు అందిస్తోంది. భారతీయ విమానయాన సంస్థల్లో ఇండిగో మాత్రమే మెయిన్‌ల్యాండ్ ఆఫ్రికాకు నేరుగా విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి నైరోబీకి రోజువారీ సర్వీస్ అందిస్తోంది. మరోవైపు ఎయిర్ ఇండియా మౌరిషస్‌కు ప్రతిరోజూ విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు మౌరిషస్‌లో ఎబోలా భయం లేదని, కేసులు ప్రధానంగా మెయిన్‌ల్యాండ్ ఆఫ్రికా దేశాలకే పరిమితమయ్యాయని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
విమానాశ్రయాల్లో ట్రాకింగ్, స్క్రీనింగ్ వ్యవస్థ
ఉగాండా నుంచి దుబాయ్, దోహా, జెడ్డా, షార్జా వంటి హబ్‌లకు విస్తృత విమాన కనెక్టివిటీ ఉండటం వల్ల భారత్‌కు పరోక్ష ప్రయాణాలు కూడా అధికంగా ఉన్నాయి. మరోవైపు డీఆర్‌సీ కనెక్టివిటీ తక్కువగా ఉండగా, దక్షిణ సూడాన్‌కు పరిమిత విమాన సేవలే ఉన్నాయి. భారత్ ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ట్రాకింగ్, స్క్రీనింగ్ వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. పరిస్థితిని బట్టి విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రత్యేక ప్రామాణిక విధానాలు (SOPs) రూపొందించే అవకాశముంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్ నుంచి ఆఫ్రికాకు మొత్తం అంతర్జాతీయ ప్రయాణాల్లో అరశాతం కన్నా తక్కువ మాత్రమే కనెక్టివిటీ ఉంది.
వివరాలు
అవసరమైతే ఐసోలేట్ చేయాలి
అందువల్ల ప్రయాణికులను గుర్తించడం, పరీక్షించడం, అవసరమైతే ఐసోలేట్ చేయడం సులభమవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎబోలా వ్యాప్తి ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలు, రూట్ మార్పులు, మార్కెట్ ఒత్తిడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి మరో సవాల్‌గా మారింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన కఠిన పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతుండటం విమానయాన సంస్థలు, విమానాశ్రయాలను ఆందోళనకు గురిచేస్తోంది.