#NewsBytesExplainer: ఫామ్-6లో కీలక మార్పు.. తల్లిదండ్రుల SIR సమాచారం ఎందుకు అడుగుతున్నారు?
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పు చేసింది. తొలిసారి ఓటరుగా నమోదు చేసుకునే వారు ఉపయోగించే ఫామ్-6 ఆన్‌లైన్ వెర్షన్‌లో కొత్త డిక్లరేషన్ సెక్షన్ను చేర్చింది. ఇందులో దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రులు గత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పును చట్టబద్ధమైన ఫామ్-6లో సవరణ చేయకుండానే ఆన్‌లైన్ పోర్టల్‌లో అమలు చేసినట్లు సమాచారం. ఈ వివరాలు తప్పనిసరి అని ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, వాటికి సమాధానం ఇవ్వకుండా దరఖాస్తు ముందుకు సాగదు.
వివరాలు
ఫామ్-6 ఎన్నికల సంఘం ఉపయోగించే అధికారిక దరఖాస్తు ఫారం
ఫామ్-6 అనేది కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఉపయోగించే అధికారిక దరఖాస్తు ఫారం.
ఈసీ ECINET పోర్టల్ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, పేర్ల తొలగింపు వంటి సేవలను అందిస్తోంది.
తాజాగా ఆన్‌లైన్ ఫామ్-6లో చేర్చిన డిక్లరేషన్ భాగంలో, దరఖాస్తుదారుడు తన తండ్రి లేదా తల్లి గత SIRలో నమోదు అయ్యారా అనే వివరాలు ఇవ్వాలి.
తల్లిదండ్రులు గత SIRలో నమోదు అయి ఉంటే, వారు నమోదైన అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ బూత్ (పార్ట్ నంబర్), అలాగే సీరియల్ నంబర్ నమోదు చేయాలి.
ఇదివరకు ఫామ్-6 ఆన్‌లైన్ వెర్షన్‌లో ఈ వివరాలు అడిగే అవకాశం ఉండేది కాదు.
వివరాలు
ఇంకా కొనసాగుతున్న 19 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ
ఈ మార్పుతో ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు కావాలంటే, దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రుల SIR వివరాలను తప్పనిసరిగా గుర్తించి నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR)ప్రక్రియను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 10 రాష్ట్రాలు,మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియ పూర్తయింది.
మరో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, జమ్మూ కశ్మీర్‌లలో SIR షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు.
అసోంలో మాత్రం జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) ప్రక్రియ పూర్తయ్యే వరకు SIR నిర్వహించబోమని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.
వివరాలు
SIR కొనసాగుతున్న అన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఫామ్-6లో ఈ కొత్త డిక్లరేషన్
బిహార్ మినహా ఇప్పటికే SIR పూర్తయిన లేదా కొనసాగుతున్న అన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఫామ్-6లో ఈ కొత్త డిక్లరేషన్‌ను చేర్చారు.
ఒకవేళ దరఖాస్తుదారుడి తల్లిదండ్రులు గత SIRలో నమోదు కాలేదంటే,ఆ ఎంపికను ఎంచుకుని వారి పేర్లు,అందుబాటులో ఉంటే EPIC (ఓటర్ ఐడీ) నంబర్లు నమోదు చేయాలి.
ఎన్నికల సంఘం అధికారుల ప్రకారం,ఈ విధానం మొదట బిహార్‌లో గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన SIR సమయంలో అమల్లోకి వచ్చింది.
అప్పటి నుంచి కొత్త ఓటర్లు ఫామ్-6తో పాటు ఈ డిక్లరేషన్‌ను కూడా సమర్పిస్తున్నారు.
అయితే ఈ మార్పును అధికారిక ఫామ్-6లో సవరణ చేయకుండా,పరిపాలనా సూచనల ద్వారా అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఫామ్-6 అంటే ఏమిటి?
ఈ డిక్లరేషన్ వల్ల కొత్త ఓటర్ల వివరాలను ఇప్పటికే ఉన్న ఓటరు రికార్డులతో అనుసంధానం చేయడం సులభమవుతుందని, అలాగే అదనపు పత్రాలు సమర్పించే అవసరం తగ్గుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది.
1960లో అమల్లోకి వచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్ ప్రకారం,కొత్త ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే అధికారిక దరఖాస్తే ఫామ్-6.
దీనిని ఆన్‌లైన్‌లో ECINET పోర్టల్ ద్వారా లేదా సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) వద్ద సమర్పించవచ్చు.
శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంటరీ నియోజకవర్గ EROకు ఈ దరఖాస్తు ఇవ్వాలి.
ఫామ్-6తో పాటు పుట్టిన తేదీని నిర్ధారించే స్వీయ ధృవీకరించిన పత్రాల ప్రతులను జతచేయాలి.
వివరాలు
చట్టం ఏమి చెబుతోంది?
ఇందులో జనన సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పదో లేదా ఇంటర్ మార్కుల మెమో, పాస్‌పోర్ట్ వంటి పత్రాలు సమర్పించవచ్చు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులకు ఓటరుగా నమోదు అయ్యే హక్కు ఉంది.
అయితే ఫామ్-6లో పౌరసత్వాన్ని నిరూపించే ప్రత్యేక పత్రాలు తప్పనిసరి కావు.
దరఖాస్తుదారుడు తాను భారత పౌరుడినని స్వీయ ప్రకటన ఇవ్వాలి. ఆ ప్రకటన తప్పుడు అని తేలితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
వివరాలు
చట్టం ఏమి చెబుతోంది?
అదే రాజ్యాంగంలోని ఆర్టికల్-326 ప్రకారం, చట్టపరంగా అనర్హత లేకపోతే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉన్న ప్రతి వయోజన భారత పౌరుడికి ఓటరుగా నమోదు అయ్యే హక్కు ఉంటుంది.
అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదుకు సంబంధించిన నిబంధనలు రూపొందించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది.