Page Loader
Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు 
ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు

Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2024
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్, లైక్‌లు, వ్యూయర్స్‌ సంఖ్యను పెంచుకోవాలనే ప్రయత్నంలో కొంతమంది వినూత్నమైన కానీ విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఒక యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం రోడ్డుపై రూ. 25,000 పారవేశాడు. నెటిజన్లను ఆకర్షించేందుకు, "ఈ డబ్బు ఎవరైనా తీసుకెళ్లవచ్చు" అంటూ వీడియోలు చేశాడు. అయితే ఈ వీడియో అతడి అనూహ్య చర్యలపై పోలీసుల దృష్టిని ఆకర్షించింది, ఫలితంగా అతడిపై చర్యలు తీసుకున్నారు. చందూ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ "మనీ హంటింగ్‌ ఛాలెంజ్‌" పేరుతో ఈ ఘటనకు కారణమయ్యాడు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ chandu_rockzz_003.

వివరాలు 

 3.8 మిలియన్ల వ్యూస్‌, లక్షకు పైగా కామెంట్లు 

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ నంబర్‌ 9 వద్ద చందూ రూ. 25,000 నోట్ల కట్టను రోడ్డుపై పారేసి, "మీ కోసం మనీ హంటింగ్‌ ఛాలెంజ్‌ చేస్తున్నాను, తీసుకోవాలనుకుంటే మీకోసమే" అంటూ రీల్‌ చేశాడు. ఈ రీల్‌కు ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటివరకు 3.8 మిలియన్ల వ్యూస్‌, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. కొంతమంది ఇది నకిలీగా ఉందని, మరికొంతమంది వ్యూస్‌ కోసం ఏమైనా చేస్తారని కామెంట్లు చేశారు. "వేసిన డబ్బులు నిజమైనవేనా?" అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. ఈ వీడియోను చూసిన చందూ షేక్స్‌ అనే నెటిజన్‌ 'ఎక్స్‌' వేదికగా రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలు 

పోలీసుల స్పందన 

"ఔటర్‌ రింగ్‌ రోడ్డు వంటి వేగవంతమైన ప్రదేశంలో ఇటువంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయి. వెంటనే చర్యలు తీసుకోవాలి" అంటూ చందూ షేక్స్‌ పోలీసులను కోరాడు. దీనిపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ స్పందించారు. ఘట్‌కేసర్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.