TESKO: టెస్కోకు విద్యాశాఖ షాక్.. రూ.105.54 కోట్ల యూనిఫాం ఆర్డర్ రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో చేనేత రంగానికి విద్యాశాఖ షాక్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యార్థుల కోసం యూనిఫాం దుస్తులు తయారీకి టెస్కో (తెలంగాణ చేనేత సహకార సంఘం)కు ఇచ్చిన రూ.105.54కోట్ల ఆర్డర్‌ను రద్దు చేస్తున్నట్లు చేనేత శాఖకు అధికారికంగా సమాచారం అందించింది. ఇప్పటికే సంక్షేమ శాఖల నుంచి సుమారు రూ.200 కోట్ల విలువైన దుస్తులు,దుప్పట్ల తయారీకి సంబంధించిన ఆర్డర్లు గడువు ముగిసినా ఇవ్వకపోవడంతో టెస్కో ఆందోళనలో ఉంది. ఇలాంటి సమయంలో విద్యాశాఖ కూడా ఆర్డర్‌ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశ కలిగించింది. గత మూడు నుంచి నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న విద్యార్థులకు అవసరమైన దుస్తులు,దుప్పట్లు టెస్కో ద్వారానే సరఫరా అవుతున్నాయి.
వివరాలు
కేంద్రీకృత టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలకు పనులు
ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆర్డర్లు అందుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 393 చేనేత సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు వస్త్రాల తయారీ చేపట్టి, వాటిని కుట్టించి మే నెలలో పంపిణీ చేస్తారు. అయితే ఇకపై టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా,కేంద్రీకృత టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఈ పనులను అప్పగించనున్నట్లు సంబంధిత శాఖలు స్పష్టం చేశాయి. ఈ మార్పు టెస్కోకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ నిర్ణయంపై ఉన్నతాధికారులను సంప్రదించగా, ప్రభుత్వ విధానంలో మార్పుల కారణంగా టెండర్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక ముందు స్త్రీశిశు సంక్షేమ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన దుప్పట్లు, చీరల తయారీకి మాత్రమే టెస్కోకు పరిమితంగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని చేనేత అధికారులు పేర్కొన్నారు.