El Niño: ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో వరిసాగు సగానికి పడిపోవచ్చని అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత ఏడాది సుమారు 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినప్పటికీ, ఈసారి అది కేవలం 30 నుంచి 40 లక్షల ఎకరాల మధ్యకే పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరిసాగుతో పాటు అధిక నీటి అవసరం ఉన్న ఇతర పంటల స్థానంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
వివరాలు
మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళిక
పంటల సాగుకు అనువైన సమయం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
దాదాపు 50 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు,చిరుధాన్యాలు,నూనెగింజలు,వేరుసెనగ,పెసలు,కందులు, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
ఈ నెల 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో అత్యవసర ప్రత్యామ్నాయ (కంటింజెన్సీ) కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నివేదికలో ప్రతిపాదించారు.
అయితే రైతులు విత్తనాలు విత్తే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.
వరుసగా రెండు నుంచి మూడు రోజుల పాటు కనీసం 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటాలని సూచించింది.
వివరాలు
నేడు ఇక్రిశాట్‌లో అత్యవసర సమావేశం
వ్యవసాయశాఖ నివేదికపై ఆదివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సోమవారం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)లో అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పశువైద్య శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆయా వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, భారత నూనెగింజల పరిశోధన సంస్థ, భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ, వాతావరణశాఖ, భూగర్భ జలశాఖ అధికారులు హాజరుకానున్నారు.
వివరాలు
రైతులకు నష్టం లేకుండా చర్యలు
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వాతావరణశాఖ, జిల్లా కలెక్టర్ల సమన్వయంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఈ ప్రణాళిక అమలుపై సోమవారం జరిగే సమావేశంలో స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
రైతులకు నష్టం లేకుండా చర్యలు
మార్క్‌ఫెడ్, విత్తన సంస్థలు, జిల్లా యంత్రాంగంతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని తెలిపారు.
జిల్లా, మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లను తగినంతగా నిల్వ ఉంచినట్లు చెప్పారు.
అదేవిధంగా రైతు వేదికలు, వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు, క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు, సాగు సలహాలు అందిస్తామని మంత్రి వెల్లడించారు.