Ration Cards: రేషన్ కార్డుదారులపై కీలక అప్‌డేట్..! స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ప్రారంభం ఎప్పటినుంచంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. పాత, కొత్త రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను అందించనుంది.
ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. కార్డులో ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్ ఉంటాయి.
మరోవైపు కార్డుదారుడి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ఈ ప్రక్రియ కోసం పౌరసరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది.
టెండర్లు దాఖలు చేసేందుకు మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు నిర్ధారించింది.
వివరాలు
రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణ కోసం టెండర్లు పిలిచింది.
రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్ కార్డులను కలిగి ఉన్నాయని, లక్షలాది మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది.
జిల్లాల వారీగా అర్హులను గుర్తించిన అనంతరం, ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో మార్చి 1న, మిగతా జిల్లాల్లో మార్చి 8న కొత్త కార్డుల పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది.
అయితే, స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల ముద్రణ జరుగుతున్న కారణంగా ఈ ప్రక్రియలో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
వివరాలు
స్మార్ట్ కార్డుల ప్రత్యేకతలు
ప్రభుత్వం అందించనున్న స్మార్ట్ రేషన్ కార్డులో ముందు వైపున తెలంగాణ ప్రభుత్వ లోగో, రేషన్ కార్డు నంబర్, కుటుంబ పెద్ద పేరు, రేషన్ షాపు నంబర్, హోలోగ్రామ్, సంబంధిత అధికారి సంతకం ఉంటాయి.
వెనుక వైపున జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా ప్రింట్ అవుతుంది.
రేషన్ షాపులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని రేషన్ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
వివరాలు
ఏటీఎం కార్డు ఆకారంలో.. కొత్త రేషన్ కార్డు
ఈ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్,కర్ణాటక, హరియాణా,గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది అధ్యయనం చేసింది.
కొత్త రేషన్ కార్డులు ఆధునికతకు తగిన విధంగా రూపొందించనున్నారు.
760 మైక్రాన్స్ మందం,85.4 మి.మీ పొడవు, 54 మి.మీ వెడల్పు కలిగిన పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను ముద్రించనున్నారు.
దీని ద్వారా కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు ఆకారంలో ఉండనుంది.