నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో దిల్లీలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. గీతా మెహతా దంపతులకు ఒక కుమారుడు ఉండగా, భర్త ఆమె కంటే ముందే చనిపోయారు. గీతా 1943లో బిజూ దంపతులకు దిల్లీలో జన్మించారు. ఉన్నత విద్యను కేంబ్రిడ్జ్ లో పూర్తి చేసిన ఆమె, గొప్ప రచయితగా, డాక్యుమెంటరీ దర్శకురాలిగా, జర్నలిస్టుగా కీర్తి పొందారు. కర్మ కోలా, స్నేక్ అండ్ లాడార్స్, ఏ రివర్ సూత్ర, రాజ్, ది ఎటర్నల్ గణేశ తదితర రచనలు గీతా పట్నాయక్ కు పేరు తెచ్చాయి. నవీన్ ఒడిశా సీఎంగా ఉన్నందుకు ప్రజలు అదృష్టవంతులని గతంలో అన్నారు.
నా ఆలోచనలన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయి: మోదీ
మరోవైపు గీతా మెహతా మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత గీతా మెహతా మరణించడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆమె బహుముఖ వ్యక్తిత్వం, మేథస్సు, రచన, చిత్ర నిర్మాణం పట్ల ఉన్న అభిరుచి అందరికీ తెలిసిందేనన్నారు. ప్రకృతి, నీటి సంరక్షణ అంశాలనూ ఆమె ఇష్టపడేవారన్నారు. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయని మోదీ వివరించారు. ఈ మేరకు ఓం శాంతి అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.