Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్
రైతులు 'చలో దిల్లీ' కవాతుకు పిలునివ్వడంతో పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు- పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో ఘర్షణ వాతావారణం నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ రైతు సంఘ నాయకుడు, భారతీయ కిసాన్ నేత రాకేష్ టికాయత్ స్పందించారు. దిల్లీలో రైతులకు ఏదైనా సమస్యను సృష్టిస్తే.. తాను, తమ సంస్థ రైతులు కూడా దిల్లీకి వస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులు తమకు దూరం కాదని, అలాగే దిల్లీ కూడా తమ ఎంతో దూరంలో లేదన్నారు. అంబాలా సమీపంలోని పంజాబ్ సరిహద్దులో గల శంభు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్‌లను రైతులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
ఎక్కడికెళ్లినా ఒక విధంగా రైతు సమస్యలు: రాకేష్ టికాయత్
బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాకేష్ టికాయత్.. రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఒకే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయన్నారు. ఏదో ఒక సంఘం రైతు సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటాయన్నారు. ఎక్కడికెళ్లినా రైతు సమస్యలు ఒక విధంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలో యునైటెడ్ ఫ్రంట్ పాల్గొనడం లేదని రాకేష్ టికాయత్ తెలిపారు. తమ రైతు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చామన్నారు.