Loading...
Andhra Pradesh: ఏటీఎస్‌ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌.. ఫాస్టాగ్‌ రీడర్లు తప్పనిసరి
ఏటీఎస్‌ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌.. ఫాస్టాగ్‌ రీడర్లు తప్పనిసరి

Andhra Pradesh: ఏటీఎస్‌ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌.. ఫాస్టాగ్‌ రీడర్లు తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల (ఏటీఎస్‌)లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటీఎస్‌ కేంద్రంలోనూ ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) రీడర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డిసెంబరు 7వ తేదీలోగా అన్ని కేంద్రాల్లో ఈ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.

వివరాలు 

వాహనాలు రాకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు!

కొన్ని ఏటీఎస్‌ కేంద్రాల నిర్వాహకులు లారీలు, బస్సుల యజమానులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు రవాణాశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి.

వాహనాలను పరీక్షల కోసం కేంద్రాలకు తీసుకురాకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు(ఎఫ్‌సీ)జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇందుకోసం వాహన యజమానుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల పల్నాడు జిల్లాలోని ఓ ఏటీఎస్‌ నిర్వాహకుడు విశాఖపట్నానికి చెందిన ఒక స్కూల్‌ బస్సు కేంద్రానికి రాకపోయినా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

దీనిపై విజయవాడ ఉప రవాణా కమిషనర్‌తో విచారణ చేయించారు.

ఆయన పల్నాడు జిల్లాలోని సంబంధిత ఏటీఎస్‌ కేంద్రానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు.

సదరు బస్సు పరీక్షల కోసం కేంద్రానికి రాకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది.

వివరాలు 

వాహనం రాకపోకల వివరాలు నమోదు

దీంతో ఇలాంటి అక్రమాలు మళ్లీ జరగకుండా రవాణాశాఖ కమిషనర్‌ కఠిన చర్యలకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగానే ప్రతి ఏటీఎస్‌లోనూ ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఏటీఎస్‌ కేంద్రాల్లో ఫాస్టాగ్‌ రీడర్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనాలు కేంద్రంలోకి వచ్చిన, బయటకు వెళ్లిన వివరాలు నమోదవుతాయి.

వాహనం రాకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు ఫిర్యాదు అందితే ఈ రీడర్లలో నమోదైన సమాచారాన్ని పరిశీలించి వాస్తవాలను గుర్తించవచ్చు.

ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లలో నమోదైన డేటాను కనీసం మూడు నెలలపాటు భద్రపరచాలని రవాణాశాఖ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

వాహనం రాకపోకల వివరాలు నమోదు

డేటాను భద్రపరచకపోయినా, రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా హెచ్చరించారు.

ఏటీఎస్‌ కేంద్రాల్లో ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నట్లు తేలితే వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్‌)కు కూడా ఆయన లేఖ రాశారు.

ADVERTISEMENT