LOADING...
University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం
ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం

University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లోని ప్రసిద్ధ వినోబా భావే విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నిర్వహించిన దర్యాప్తులో, విశ్వవిద్యాలయంలో రూ.44 లక్షల అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ అక్రమాలు విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ముకుల్ నారాయణ్ దేవ్ హయాంలో చోటుచేసుకున్నాయని తేలింది. ఆడిట్ డైరెక్టరేట్ రూపొందించిన నివేదికను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌కు సమర్పించగా, ఒక నెలలోపు అక్రమంగా ఖర్చయిన మొత్తాన్ని వసూలు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో స్నాక్స్, టీ, బిస్కెట్లు కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది.

Details

ప్రభుత్వ దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి

విశ్వవిద్యాలయం కరోనా కారణంగా మూసివేసిన సమయంలోనూ ఈ ఖర్చులు జరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా వైస్ ఛాన్సలర్ నివాసానికి రంగులు వేయడానికి లక్షల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారు. పెయింట్ మెటీరియల్ కొనుగోలులో గణనీయమైన అవకతవకలు చోటుచేసుకున్నాయి. అదనంగా, ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడమే కాకుండా, ఇంధన ఖర్చును పూర్తిగా విశ్వవిద్యాలయ నిధుల ద్వారా సమకూర్చారు. అలాగే మాజీ వీసీ ముకుల్ నారాయణ్ దేవ్ కోసం అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే విశ్వవిద్యాలయ నిధులతో రెండుసార్లు మొబైల్ ఫోన్లు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

Details

అవకతవకలపై కఠిన చర్యలకు ఆదేశాలు

కంప్యూటర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నా కొత్తగా మరిన్ని కంప్యూటర్ల కొనుగోలుకు భారీగా ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. కొనుగోలు చేసిన వస్తువుల గురించి స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడం గమనార్హం. అంతేగాక వైస్ ఛాన్సలర్ నివాసంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలోనూ భారీగా అక్రమ ఖర్చులు జరిగాయని నివేదికలో తేలింది. వైస్ ఛాన్సలర్ నివాసానికి మంచం, సోఫా, వాషింగ్ మెషిన్ వంటి సామగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన వైద్య పరికరాలను సైతం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ మొత్తం అవకతవకలపై విశ్వవిద్యాలయం, ఆర్థిక శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆడిట్ నివేదికలో సూచించారు.